BHAGAVATA KADHA-3    Chapters   

ద్వారావతినుండి అర్జునాగమనము

49

శ్లో|| ఇతి చింతయత స్తస్య దృష్టారిష్టేన చేతసా,

రాజ్ఞః ప్రత్యాగమ ద్బ్రహ్మన్‌ యదుపుర్యాః కపిధ్వజః ||

----భాగ. 1 స్కం. 14 అ.22 శ్లో.

మఱియు మహోత్పాతంబులు పెక్కులు పుట్టుచున్నయవి. మురాంతకుని వృత్తాంతంబు వినరాదని కుంతీసుతాగ్రజుండు భీమునితో విచారించు సమయంబున."

క. ఖేదమున నింద్ర సూనుఁడు

యాదవ పురినుండి వచ్చి యగ్రజుఁ గని త

త్పాదముల నయన సలిలో

త్పాదకుఁడై వడియె దీను భంగి నరేంద్రా ! "

---- శ్రీమదాంధ్రభాగవతము.

ఛప్పయ

ధర్మరాజ భయభీతభ##యే అర్జున తహఁ ఆయే,

ముఖమండల అతి మలిన దుఖిత చింతిత ఘబరాయే||

సబ ఈ హర్షిత భ##యే నహీఁ అర్జున హరషాయే,

పకరి పైర గిరిపరై, బచన నహిఁ కఛూ సునాయే||

బార బార పూఛేఁ నృపతి, బంధు ! బతాఓ బాత్‌ సబ,

సంబంధీ సబ సుఖీ హైఁ ? కహో వహాఁ తేఁ చలేఁకబ||

అర్థము

ధర్మరాజిట్లు భయభీతుఁడు కాఁగా అర్జునుఁడు ద్వారక నుండి వచ్చెను. ఆతని ముఖమండలి మతి మలినమై దుఃఖితమై, చింతితమై, భయపడినట్లై యుండెను. అర్జునుఁడు వచ్చినాఁడని అందఱు హర్షించిరి కాని అర్జునుఁడు హర్షింపలేదు. ఆతఁడు ధర్మరాజుపాదములపైఁబడి మాటలాడక ఊరకుండెను. ధర్మరాజు మాటిమాటికి "సోదరా ! మన సంబంధు లందఱు సుఖముగ నున్నారా ? ఇప్పుడు నీవక్కడకు వెళ్లి యెన్నిరోజులైనది నాయనా!"

----

మన మెవరిని గూర్చి చింతించుచుంటిమో ఆతఁడప్పుడే వచ్చునెడల మన సంతోషమునకు అప్పుడంత ముండదు; కాని మన యనుమానమునకుఁదగినట్లే యాతఁడు దుఃఖితుఁడగుటను గాంచిన నిఁక మనకప్పుడు హర్షమునకు బదులు దుఃఖము కలుగును. ఈభావమునకే హర్ష విషాద సాంకర్య భావమనిపేరు. దీనిలో హర్షవిషాదములు రెండు నుండును. చూచుటకు హర్షము నిశ్చితముగానే యుండును, కాని విషాదవిషయమున శంకనిలిచియే యుండును. ఆ శంకా సమాధానమునకే మనము ప్రత్యుత్తరమును బ్రతిక్షింపకయే తొందఱచే చాల ప్రశ్నలు వేయుచుందుము. అప్పుడు మన శంకలన్నిఁటిని వేడలఁగ్రక్కి ఆ శంకలలో నేదో ఒకదానికి అవుననియో కాదనియో జవాబు కావలెనని కోరుచుందురు.

ధర్మరాజు చింతితుఁడయ్యెను. దుఃఖించుచుండెను. అపశకునములచే నాతని వ్యాకులత యెక్కుడయ్యెను. ఆసమయముననే అర్జునుఁడు వచ్చి యెదుట కనఁబడెను. ఆతఁడు వెళ్లి యేడెనిమిది మాసములైనది. ఆతని సుహృత్సంబంధులఁ జూచి వచ్చుచున్నాఁడు. ప్రాణాధికులగు ప్రియబంధువులను జిరకాలము దర్శించి అచ్చటనే చాలకాలముండి వచ్చినాఁడు. ఈ కారణము లన్నిటిచే నర్జునుఁడు సంతోషముగ నుండి యుండవలయును. ఆతని ముఖమండలము ప్రేమ ప్రముదితమై యుండవలెను. ఆతఁడట్లు లేక దుఃకితుఁడై నట్లు కనఁబడుచుండెను. ముఖము వాడి తేజోవిహీనమై యుండెను. ముఖకాంతి మాసేను. ఆతఁడేదో గాఢచింతలోఁ బడినట్లును, గొప్పశోకములో మునిఁగినట్లును, సంతాపముచే సంతప్తుఁడైనట్లుండెను. తన కమలనేత్రముల నుండి శోకముచే నుష్ణ నేత్రబిందువులను రాల్చుచు దీనపద నుఁడై తలవంచుకొని అర్జునుఁడు ధర్మరాజు చరణములందాకులతతోఁ బడెను. తనకు దుఃఖము కలిగినట్లే తన తమ్ముఁéడు కూడ దుఃఖితుఁడగుటను గాంచఁగానే ధర్మరాజునకు నారద వాక్యములు స్మరణకు వచ్చెను. ఆతని హృదయము కొట్టుకొను చుండెను. ద్వారకాపురిలో తనవారి క్షేమమును బేరుబేరు వరుసల నడిగెను.

ధర్మరాజు అర్జునుని శిరస్సునఁ జెయియుంచి యిట్లడిగెను :- " సోదరా ! నీవిట్లు దుఃఖముతో నుంటివేల ? దారిలో నేదైన దుర్ఘటన సంభవించినదా ? అధికవేగములగల రథముపై నీవు వచ్చుటచే నీవలసిపోతివా ? ద్వారకలో మన బంధువులగు మధు, భోజ, దాశార్హ, సాత్వతాంధక వృష్ణివంశ వీరులందఱును పరివార సహితముగా ఁ గుశలముగ నున్నారా ? యాదవు లందఱలో శ్రేష్ఠుఁడును జ్యేష్ఠుఁడు నగు శూరుఁడు మంత్రి పురోహితాదులతోఁ గుశలముగ నున్నాఁడా ? ఆతని రాజ్యములో దుర్ఘటన యేమియు జరుగలేదు కదా ? మాననీయుఁడగు మనమామ వసుదేవుఁడు క్షేమమే కదా ? ఆతని తమ్ముఁడును మనకు చిన్నమామయునగు దేవభాగుఁడు కుశలమేకదా ! మన ధృతదేవుఁడు శాంతిదేవుఁడు, ఉపదేవుఁడు , శ్రీదేవుఁడు, దేవరక్షితుఁడు, సహదేవుఁడు, దేవకుఁడు ఈయేడుగురు పెద్దమామలును, కంసా, కంసవతీ, కంకా, శూరభూ, రాష్ట్రపాలికా మొదలగు చిన్నత్తలు, వారి పుత్రులు, పుత్రబంధు సమేతముగ సుఖముగ నున్నారా ?

ఎవని మాటమీఁద కోట్లకొలఁది యాదవులుందురో, ఎవని కుమారుఁడగు దుషటకంసుని శ్రీకృష్ణుఁడు సంహరించి ఆతనిని సింహాసనమునఁగూర్చుండఁబెట్టెనో, అట్టి వృద్ధపితామహుఁడును యాదవ మహారాజు నగు ఉగ్రసేనమహారాజు బాగున్నాఁడు కదా ? దేవకీదేవి తండ్రియు, ఉగ్రసేనుని తమ్ముఁడును అగు దేవకమహారాజు నిరోగియై క్షేమముగ నున్నాఁడా ? వీరందఱు చాలవృద్ధులై యుండవచ్చును. వీరి దర్శనము చేసియు చాల దినములైనది.

తమ్ముఁడా! నీవు మాటలాడవేమి ? హృదీకుఁడున్నాఁడా ? కృతవర్మ, అక్రూరుఁడు, జయంతుఁడు, గదుఁడు, సారణుఁడు, శత్రుజిత్తు వీరందఱు కుశలమేనా? మాననీయుఁడగు ముసలధారియగు బలరాముఁడు సుఖమేనా ? ప్రద్యుమ్నుఁడు, అతని పుత్రుఁడగు ననిరుద్ధుఁడు వీరందఱ సమాచారమేమి ? నాకు శ్రీకృష్ణ పుత్రుల పేరులే తెలియవు. ఒకరు ఇద్దరు అయినచో కము పెట్టుకొనవచ్చును. 191080 కేవలము శ్రీకృష్ణుని పుత్రులు. ఇఁక వారికిఁగూడ పుత్రపౌత్రులు కలిగియుండవచ్చును. వీరందఱ పేరులెట్లు జ్ఞాపక ముంచుకొనఁ గలుగుదును ? అయితే సుషేణ, చారుదేష్ణ, సాంబ, ఋషబాదులపేర్లు పది పదునైదు పేర్లు తెలియవు. వీరందఱు వారి బంధువులతోఁ గుశలమేనా ?

నీవు వెళ్లితివే. వారందఱు నిన్నెట్లు సమ్మానించిరి ? మమ్ములను గూర్చి వారే మడిగెడువారు? శ్రీకృష్ణుఁడు ఏదైన ప్రసంగము వచ్చినప్పుడు మమ్ములను నెన్నఁడైన స్మరించునా ? లేదా ? నీమనస్సక్కడ నుండఁగా నానందముగ నున్నదా ? శ్రీకృష్ణుఁడు మాకేమి సందేశము పంపినాడు ? మన అవ్వలు, తాతలు, అత్తలు, మామలు మాకేమి యుపహారములను బంపిరి. ఈ విషయము లన్నియుఁ జెప్పుము.

శ్రీకృష్ణుని కుశలమును నేనేమని యడుగుదును ? ఆతఁడు కుశలస్వరూపుఁడే యయ్యెను. సమస్తానందములకును, మంగళము లకును ఆతఁ డొక్కఁడే కదా నిధి. స్వర్గమునుండి యింద్రుని సభను దెచ్చినవాఁడు, సత్యభామ కోరఁగా ఇంద్రుని నందనోద్యానమునుండి పారిజాతవృక్షమును బెల్లిగించుకొని వచ్చినవాని కుశలమును గూర్చి యడుగుట కుశలమును గళంకిత పరచుటయే కాఁగలదు.

ఎవ్వఁడు పరిపూర్ణమగు బ్రహ్మమయ్యు బ్రాహ్మణ భక్తుఁడయ్యెనో, ఎవ్వఁడు మానవ వేషమును ధరించియు మాయాతీత మహేశుఁడయ్యెనో, ఎవఁడు యదుకుల క్షీరసాగర మున ననంతావతారుఁడగు శేషుని సహాయమును గొనుచు సుఖముగా ఁ గమనీయ క్రీడలొనర్చుచున్నాఁడో, ఆద్యంతములు లేని వాడుఁను, తన్నాశ్రయించిన భక్తుల రక్షించుటయందు తత్పరుఁడగు వాఁడును, ఎవని కృపచే భూమిమీఁద నుండియు యాదవులందఱు విష్ణుపార్షదులవలె వైకుంఠ సుఖముల ననుభవించుచున్నారో అట్టి శ్రీకృష్ణుని కుశలము మర్త్యలోకములో మాయామోహవ్యాప్తి చెందిన నేనేమని యడుగుదును?

అర్జునా ! ఎంతటి యాశ్చర్యము ! రాజులకు పది యిరువది మంది రాణులుండిన వారినందఱను సమానముగ సంతుష్టులఁగావించుట దుర్లభమగును. ప్రతిరోజును సవతులలో నేదియో కలహము పుట్టుచునే యుండును. ఒక్కొక్కచోట లాగి పీఁకుకొనుటయు జరుగుచుండును. కాని శ్రీకృష్ణునకు రుక్మిణి మొదలు కొని 19108 మంది రాణులు. అందఱు సంతుష్టులే. అందఱును శ్రీకృష్ణ చరణారవిందములందు ఒకరికి మించి ఒకరికి అనురాగమధికము. స్వర్గాధిపతియగు దేవేంద్రుని రాణి శచీదేవికూడ అనుసంభవింపని దివ్యభోగములను వారనుభవించుచుండిరి.

శ్రీకృష్ణుని బతిగా గ్రహించి యారాణులందఱు నుప్పొంగి పోవుచుండుదురు. ఆరాణులు నీతో మాటలాడుచుండుదురా? వినోదములలో వారు నిన్నుపహాసము చేయుచుందురా ? నీవుండు చోటకు శ్రీకృష్ణునితోఁ జాలసారులు వచ్చుచుందురా ? నేను బోయిన వారందఱు సిగ్గుపడెదరు. ముసుఁగులు వేసికొందురు. కాని వారంద ఱొక్కసారిగా నాభూషణములను దఱించి కదలి పోవుచుండిన మన్మథసేన తరలిపోవుచున్నదా యనునట్లుండును."

ఇంతగా అడిగినను అర్డునుఁడు పలుకక పోవునప్పటికి ధర్మరాజునకు సందేహ మింకను అధికమయ్యెను. యాదవుల కుశల మడిగిన కొలఁది ఆతని ముఖమింకను వాడిపోవుచుండెను. అందువలన నాతఁడు మరల నిట్లనెను :- " అర్జునా ! నీవు పలుకుటలేదు. నీవేల యిట్లెడ్చుచున్నావు ? నేనెంతగా అడిగినను నీవు యాదవుల కుశలము చెప్పవు కారణమేమి ? ఏకారణము వలననైన నీకును యాదవులకును జెడలేదుకదా ? నీవు బోత్తుగాఁ దేజోవిహీనుఁడ వైనా వేల ? తనవారంద ఱిక్కడనుండి అచ్చటి వారు పేక్షించిన సాధరణముగ నట్లే యుండును. ద్వారకలో యాదవులు నిన్ను పేక్ష చేయకుండిన నీకెవరైన నవమానము కలిగించినారా ? ఎవరో బయట వారవమానించిన నంతగా బాధయుండదు. బందువు లయినవా రవమానించిన నా గాయము శస్త్రముచేనైన గాయముకంటె నెక్కుడుగ నుండును. ఈయవమానము చచ్చువఱకు మఱువునకు రాదు. దుర్భావయుక్తమగు నమంగళవచనము హృదయమును ఛెదించుకొని పోవును. ఆ చింతచే ముఖము సదా వ్లూనముగ నుండును. ఆంతరిక పీడ శరీరమును వికృతము కావించును.

తేజో విహీనమగుట కింకొక కారణము కూడ కలదు. ఒకానొకఁడు గంపెడంత యాశతోనొక కార్యము కొఱకు మనదగ్గఱకు వచ్చెననుకొనుఁడు. ఆకార్యమును నెఱవేర్చి పెట్టుటలో మన మన్నివిధముల సమర్థుల మనుకొనుఁడు. అట్టియెడ ఆతఁడు మనదగ్గఱకు వచ్చి సహాయము కొఱకై ప్రార్థించినాఁ డనుకొనుఁడు. ప్రార్థనను విని మనస్సు కరిగి సహాయము చేతుమని నమ్మించి నిశ్చింతగా నుండుమంటి మనుకొనుఁడు. మన మాట మీఁద మనలను నమ్మి వారు నిశ్చింతగానుండి కార్యము జరుగుననుకొన్నా రనుకొనుఁడు. కొంతకాలమైన తర్వాత లోభవశముననో, ప్రామాదవశముననో వానికిట్లు చెప్పితిమనుకొనుఁడు: " అబ్బాయీ ! మావలన నీపని నెఱవేరదు. నీయిష్టము వచ్చిన వారి దగ్గఱకుఁబోయి నీవు చేయించుకొన వచ్చును. నామీఁద మాత్రము ఆశ##పెట్టుకొనకుము" అనిన నీమాటకా యాశ##పెట్టుకొన్నవాఁడు నిరుత్సాహము చెంది శాపముపెట్టిన, విశ్వాస ఘాతమగుటచేఁదన హృదయములో మాటిమాటికది పొడుచు చుండిన, నీకారణమున మానవుఁడు శ్రీహీనుఁడు కాంతిరహితుఁడు కాఁగలఁడు. నీవిట్టి పని చేయలేదుకదా ?

ఇదేవిధముగా దుఃఖితులై బ్రాహ్మణుఁడు, బాలకుఁడు, గోవు, వృద్ధుడు, రోగి, స్త్రీ వీరిలో నెవరైన నిన్ను శరణు వేఁడిన , వారిని రక్షింప సమర్ధులమయ్యు రక్షింపక తిరస్కారముగ విడిచి పుచ్చుచో వాఁడు కూడ తేజో విహీనుఁడు భీభత్సుఁడు కాఁగలఁడు.

నీముఖము వాడిపోయినది. ఎంత యడిగినను జవాబీయవు. ఇట్టిస్థితి యవమానమునఁ గూడ కలుగును. ఆంతరికగ్లానిచేఁ గూడ నిట్లుండును. పాపకర్మచేఁగూడ నీస్థితి కలుగును. పొరబాటునైన నీవు అగమ్యాగమనము చేసి సంతానార్థమై వచ్చిన స్వభార్యను దిరస్కరించితివని నేను స్వప్నమునైన విశ్వసింపను. ఇట్టి కార్యము ఇదివఱకెన్నడును జేయలేదు. నీవు ఇదివఱకు ధర్మము నెన్నడును వీడలేదు. స్వర్గములో శ్రేష్ఠురాలగు ఊర్వశీ స్వయముగ నిన్ను ఁ గోరఁగా నామెను 'తల్లీ' యని సంబోధించి సత్కరించితివి. అట్టివాఁడవు నీవు పరాయి స్త్రీని కన్నెత్తియైనఁజూతువా ? ఒకవేళ యిట్టిపాపము నీవలన జరుగ లేదుకదా ?

సోదరా ! బలవంతుఁడగువాఁడు బలహీనునితోఁ బోరియెడినను గాంతిహీనము కాఁగలదు. నీవు మహాభారత యుద్ధములో భీష్మ ద్రోమ కర్ణాదులవంటి మహారథులను గూడ పరాజితులఁ గావించితివి. నీవెవరి చేతనో ఓడిపోవుట సంభవింపనిపని.

మానవుఁడింద్రియ వశీభూతుఁడై జిహ్వ చాపల్యవశమున స్వాదిష్టపదార్థములను దన యాశ్రమములో నున్న వృద్ధ బాలకులకు మునుముందుగాఁబెట్టక తాను దినుచుండినను మానవుని సద్గుణములన్నియు విలీనములై పోనును. అట్టివాఁడు ప్రేతమువలెఁ గనఁబడును. శాస్త్రములోఁజెప్పఁబడిన నింద్య కర్మలొనర్చినను మానవుని ముఖములోని మలినమేర్పడును. ఇట్టి కార్యమేదియు నీవు చేయలేదుకదా ? నిశ్శంకుడవై నాతో నున్నదున్నట్లు చెప్పుము. నేను గొప్పవిద్వాంసులను, శాస్త్రమవేత్తలను కర్మిష్ఠులను బిలిపించి దానికి ప్రాయశ్చిత్తము చేయించెదను.

ఇదిగాక నాకు చివర సందేహ మొకటి కలదు. దానిని నేను జెప్పఁదలఁచుట లేదు. ఆ శంక నిర్మాలమై వచ్చునట్లు భగవంతుఁడు చేయవలయును. కాని అది నిర్మాలమై వచ్చునట్లు నాకు తోఁచుట లేదు. భయంకరోత్పాతముల చేతను, కాలవైపరీత్యము చేతను, పృథ్వ్యంతరిక్షములందును ఆకాశమునను అపశకునములు గోచరించుటచేతను, ఉండి ఉండి ఆసందేహమే నాకు కలుగుచున్నది. నీకు పరమ ప్రేమాస్పదుఁడును, అభిన్న హృదయుఁడును, సుహృదుఁడును, సుఖుఁడును, సారథియు, సంబంధియు, స్నేహితుఁడు నగు శ్యామసుందరుఁడు ఏడ్చుచున్న నిన్ను వదలి యీ ధరాధామమును వదలి స్వధామమునకు వెళ్లి పోలేదుకదా ? సోదరా ! ఇదివఱకు నేను చెప్పిన కారణము లన్నియుఁ బ్రసంగవశమునఁ జెప్పినవి. ఇది తప్ప నీహృదయము నకు వేఱు దుఃఖకారణము లేదని నా యంతఃకరణము నొక్కి చెప్పుచున్నది. ఇంతకు తప్ప వేఱుకారణము నాకు గోచరించుట లేదు. సోదరా ! ఇంకెంతవఱకు దాఁచెదవు ? మర్మము విడిచి నిజము చెప్పుము. శ్యామసుందరుఁడు మనమేమి యపరాధము చేసినామని మనల నొంటరిగా నీభూమిపై వదలి వెళ్లిపోయినాఁడు ? శ్యామసుందరుఁడొక్కఁడే వెళ్ళినాఁడా లేక ఇంకెవరైన వెళ్లినారా ? ఆతఁడు లేక యాదవు లెట్లుండఁగలరు? సోదరా ! ఉన్నదున్నట్లుగాఁ జెప్పు మిప్పుడు."

ఇట్లు పలుకుచు ధర్మరాజు వెక్కి వెక్కి యేడ్వఁబ్రారంభించెను. అర్జునుఁడు కూడ కేకవేసి బిగ్గఱగ నేడ్చెను. ఇదియే కారణమని అందఱును గ్రహించిరి. కావున పాండవులును, సబాసదులును శోకసంతప్తులై దీర్ఘనిశ్శ్వాసములు విడుచును చ్చైస్వరమున విలపింప మొదలిడిరి.

ఛప్పయు

అరజున బోలేఁ నహీఁ , బహుత బిలపేఁ పఛితావేఁ |

ధర్మరాజ పుచకారి, పార్య కరి ధీర బఁధావేఁ ||

దుఖకో కారన బంధు! శోక తజిమోఇ బతాఓ |

యదునందనకే సభీసుఖద సంవాద సునాఓ ||

వచన కఠిన కాహూ కహే, అథవా అపమానిత భ##యే |

యా తను తజి కేభువన పతి, నిత్య ధామ తో నహిఁగయే ||

అర్థము

అర్జునుఁడు ద్వాకరనుండి వచ్చి యేమియు మాటలాడలేదు. మిక్కిలి విలపించెను. పశ్చాత్తప పడెను. ధర్మరాజోదార్చి, ప్రేమించి ఎంతో ధైర్యము చెప్పెను. తమ్ముడా ! శోకమును వీడి దుఃఖకారణమును జెప్పుము. యదునందన గోపాలకృష్ణుని సుఖవార్తలను గూర్చి తెలుపుము.

ఎవరైనఁ గఠిన వాక్కుల బాధించినారా ? ఎక్కడైన నవమానము జరిగినదా ? లేక విశ్వనాథుఁడగు కృష్ణుఁడవతారమును వీడి స్వధామమునకుఁబోయెనా ? చెప్పుము.

BHAGAVATA KADHA-3    Chapters